కుత్బుల్లాపూర్, జూన్ 14 : భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవలో తలదూర్చిన నలుగురు వ్యక్తులు భర్తపై దాడి చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశా రాష్ర్టానికి చెందిన తపస్విని, శరత్(46) ఆరేండ్ల కిందట నగరానికి వలస వచ్చి నగర శివారు గుండ్లపోచంపల్లిలో రమణయ్య అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో కూలీ పనులు చేసుకొంటూ అక్కడే గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 12న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా అక్కడే ఉన్న సూపర్వైజర్ వెంకటాద్రి నాయుడు వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత సూపర్వైజర్పై గొడవకు దిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సమీపంలో ఉన్న మరో ఇటుక బట్టీ యజమాని సాంబశివరావు శరత్‌ను మందలించాడు.
అప్పటికే శరత్ చేతిలో ఉన్న కర్రతో సాంబశివరావు అలియాస్ సాంబయ్య తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలు కాగా, అక్కడే ఉన్న సూపర్వైజర్ వెంకటాద్రి నాయుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అయితే తమ యజమాని సాంబయ్యను కొట్టాడని కోపొద్రిక్తులైన అతని కూలీలు ఒరిశా ప్రాంతానికి చెందిన సోంవార్, ప్రదీప్, బోరా, అజయ్ అనే నలుగురు మూకుమ్మడిగా శరత్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రగాయాలైన శరత్‌ను తన యజమాని రమణయ్య స్థానికంగా ఉన్న మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా, మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు గాంధీ వైద్యశాలకు తరలించారు. బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 13న ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య తపస్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడిపై దాడికి దిగిన వ్యక్తులు పరారీలో ఉన్నారు.