సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు పరికరాలు, ఉపకరణాలు, కృత్రిమ అవయాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన దివ్యాంగుల గుర్తింపునకు స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు. అలీమ్ కో స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగుల సీనియర్ సిటిజన్లను గుర్తింపు అసెస్మెంట్ను సరిళ్ల వారీగా ఈ నెల 20 నుంచి జూలై 6వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గుర్తించిన ఆయా కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలని, సెంటర్లలో ఏమైనా మార్పులు ఉంటే ఈ నెల 14వ తేదీ వరకు నివేదిక పంపించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రత్యేక క్యాంపుల సందర్భంగా రెండు డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేశారు. ఒకొక టీమ్‌లో ఒక ప్రొస్తేస్తిస్ట్స్ వైదుడిని మరొక ఆర్తోటిస్ట్స్ వైద్యుడితో పాటు ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో గుర్తించిన వారికి పరికరాలు, సహాయ ఉపకరణాలు, కృత్రిమ పరికరాలు ఎన్ని అవసరం ఉంటాయో నిర్ధారించి, ఆ తర్వాత అదే చోట పంపిణీ చేస్తారు.

సదరన్, ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్ కార్డు, అంగవైకల్యానికి సంబంధించిన పాస్‌పోర్టు సైజ్ రెండు ఫొటోలు, ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు, పుట్టిన తేదీతో ఉన్న ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ శిబిరాల్లో నాన్ లోకల్ వారికి అనుమతి లేదు.
