అమీర్‌పేట్, జనవరి 31 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చెందిన వివిధ పక్షాల నేతలతో పాటు బస్తీ వా సులు మంత్రి తలసానిని కలిసి ఆలయ అధికారుల వైఫల్యాలపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ దే వాలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో బస్తీవాసులు మంత్రిని కలిశారు.