తెలుగుయూనివర్సిటీ, జూన్ 7 : ఉన్నతమైన పేరిణి నృత్యకళను ఔత్సాహిక కళాకారులకు చేరువ చేయాలని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో లంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గురువు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 11వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన నృత్యాంశాలకు కళాకారులు తమదైన శైలిలో వేదికపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
లంబోదర కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ నక్క అధ్యక్షతన జరిగిన ఈ సభలో నృత్య గురువులు జి. అచుటంబ, గంధం కృష్ణవేణి, పావని గరిమెళ్లలకు నటరాజ రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన కీర్తి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ పోతినేని శ్రీనివాసరావు, రమేశ్, అషు, సందీప్, మాధవి, తులసి, చైత్ర తదితరులు పాల్గొన్నారు.