మాదాపూర్, జూన్ 7 : చక్కటి సౌకర్యాలు..కూర్చునేందుకు కుర్చీలు..తినేందుకు బల్లలు..తాగునీటి సౌకర్యం..రుచికరమైన భోజనం..ఇది అన్నపూర్ణ క్యాంటీన్ భోజనం గురించి. పాదచారులు, రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లు, రోగుల బంధువుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. రూ.5కే అన్నం, రెండు కూరలు, సాంబారుతో భోజనం పెడుతుండడంతో అనేకమంది ఆకలి తీర్చుకుంటున్నారు. మాదాపూర్ సైబర్టవర్స్ నుంచి సీవోడీ మార్గంలో ఎడమవైపు ఉన్న బస్టాప్‌ను రెండునెలల క్రితం అన్నపూర్ణ క్యాంటీన్‌గా మార్చారు.
ఇక్కడ నిత్యం స్విగ్గీ డెలివరీ బాయ్స్, ఆటోడ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, క్యాబ్డ్రైవర్లు, చుట్టుపక్కల ఉండే ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ ఆకలి తీర్చుకునేందుకు నిత్యం వందలసంఖ్యలో వస్తుంటారు. రూ.5 కే నాణ్యమైన భోజనం కడుపు నింపుతుండడంతో సమీప ప్రాంతాల్లో పనిచేసే భవన నిర్మాణ కూలీలు సైతం ఇక్కడి భోజనంతో సంతృప్తి చెందుతున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా ఒకేచోట ఉండటం, భోజనం చేసే వారు అధిక సంఖ్యలో వస్తుండడంతో 2నెలల క్రితం అక్కడున్న బస్టాప్‌ను ఆహ్లాదకరంగా చిన్నపాటి రెస్టారెంట్‌ను తలపించేలా ముస్తాబు చేశారు.
రూ.5కే భోజనం గ్రేట్
పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా రూ.5కే చక్కటి భోజనం అందించడం గొప్ప విషయం. ప్రతిరోజు డబ్బులు పెట్టి హోటల్లో తినలేని వారికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగకరం.
– మారుతిరెడ్డి, అన్నపూర్ణ క్యాంటీన్ ఉద్యోగి
ఆకలి తీరుతున్నది..
బయట భోజనం చేస్తే రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు చేయాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా నగరమంతా తిరుగుతుంటాను. రూ.5కే నాణ్యమైన భోజనం పెడుతున్నారు. పేదల ఆకలిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం క్యాంటీన్ ఏర్పాటు చేయడం మంచి విషయం.
– రణధీర్, అంబర్‌పేట
రెస్టారెంట్ అనుభూతి
రెస్టారెంట్లో ఉన్నట్లు అన్నిరకాల వసతులు మాదాపూర్‌లోని అన్నపూర్ణ క్యాంటీన్లో ఉన్నాయి. రూ.5కే మంచి భోజనం పెడుతున్నారు. పక్కనే దవాఖానలో పనిచేస్తుంటాను. ఇక్కడ భోజనం చేస్తే రెస్టారెంట్లో తిన్న అనుభూతి కలుగుతుంది.
– అమర్, మాదాపూర్