కుత్బుల్లాపూర్, జూన్ 5: పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతృప్తి లభిస్తుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో 60 ఎంఎన్సీఎస్ కంపెనీల ఆధ్వర్యంలో జరిగిన గేట్‌వే ప్లేస్మెంట్ డే వేడుకలో కళాశాల నుంచి వంద శాతం విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కళాశాల అధ్యాపక బృందం ముందుకు వెళ్లాలని సూచించారు. వంద శాతం విద్యార్థులు ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పొందడం చాలా సంతోషంగా ఉన్నదని, అందుకు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి. సంతోష్ కుమార్ పాత్ర కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం 2021-22 విద్యా సంవత్సరానికి చెందిన 1158 మంది విద్యార్థులకు ఆయా కంపెనీల్లో వచ్చిన ఉద్యోగ నియామక సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ఎంఎన్సీల కంపెనీల నిర్వాహకులు బాలప్రసాద్ పెద్ది, వెంకట ప్రశాంత్ గాడే, రామకృష్ణ ముద్దాలి, అనూప్ సేథి, వర్తుసా, అనిల్‌కుమార్ ఘెర కవి, ప్రశాంతి నిడ మర్తి, శ్రీదేవి సిరా, యశ్వంత్, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ యాదవ్, ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.రాజశేఖర్ యాదవ్, ఎం.భద్రారెడ్డి, దర్శకుడు జైకిసాన్ యాదవ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.