సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): కనీస పౌర సదుపాయాలు అందుబాటులోకి తేవడమే పట్టణ ప్రగతి ప్రధాన ఉద్దేశం అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేసి పచ్చదనం పెంపు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతితో సమీకృత పట్టణాభివృద్ధి సాధించడం జరుగుతున్నదని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మూడో రోజైన ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, మొకలు నాటే స్థలాల గుర్తింపు, పట్టణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూడిక తీత, గుంతలు పూడ్చడం లాంటి పనులు చేపట్టారు. కాగా, 474 బస్తీ, కాలనీలలో పట్టణ ప్రగతి నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
-శిల్పా హిల్స్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆకస్మిక పర్యటన
మాదాపూర్, జూన్ 5: మాదాపూర్‌లోని శిల్పాహిల్స్లో ఆదివారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ సుదాంష్, డీఈ స్రవంతి, జల మండలి డీజీఎం శ్రీమన్నారాయణలతో కలిసి శిల్పాహిల్స్లో పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ కాలనీల సంరక్షణతో పాటు శుభ్రతకు కృషి చేయాలని కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. శుభ్రతలో హైదరాబాద్‌ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు శ్రద్ధ చూపాలని తెలిపారు. కాలనీ వాసులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఆటో రిక్షాలోనే వేయాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు, చెత్తను వేయకూడదన్నారు. నివాస ప్రాంతాల్లో నీటి నిలువలు లేకుంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ, డాక్టర్ కార్తీక్, ఏఈ ప్రశాంత్, ఇజ్జత్ నగర్ వార్డు సభ్యులు రాంచందర్, గోకుల్ ప్లాట్స్ వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, ఎస్ఆర్పీ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో మూడో రోజు చేపట్టిన కార్యక్రమాలు