కవాడిగూడ, జూన్ 4 : దళితబంధు పథకంపై అపోహలొద్దని, అర్హులైన ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే 100 మంది దళితులకు ఈ పథకం మంజూరు కాగా, దశలవారీగా యూనిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. శనివారం భోలక్‌పూర్ ఘంటసాల మైదానంలో 24 మంది దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని, అర్హులైన వారికి తప్పకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యిమందికి లబ్ధి చేకూరుస్తామని హామీఇచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి లబ్ధిదారుడికి రూ.10 లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టిందని అన్నారు.
ఈ పథకంపై అపోహలు వద్దని, పార్టీలకతీతంగా అందజేస్తామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ మాట్లాడుతూ దశలవారీగా లబ్ధిదారులకు యూనిట్లు అందజేస్తామని, కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ భోలక్‌పూర్, గాంధీనగర్, ముషీరాబాద్, కవాడిగూడ,అడిక్‌మెట్, రాంనగర్ డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస రావు, శ్రీనివాస్ గుప్త, వల్లాల శ్యామ్యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, మోజెస్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, ఎం.ప్రభాకర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.