సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న హెచ్ఎండీఏకు చెందిన వెంచర్లో శనివారం నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి భారీ స్పందన లభించింది. సుమారు 10 ఎకరాల్లో మొత్తం 34 ప్లాట్లను అభివృద్ధి చేస్తుండగా దాదాపు రెండు వందల మంది కొనుగోలుదారులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ వెంచర్ ప్రాధాన్యతను హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డిలు వివరించారు. 600 గజాల నుంచి 100 గజాల వరకు మొత్తం 34 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో ఉండటంతో అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని అధికారులు వివరించారు. ఈ లే అవుట్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బ్యాంకు రుణాలు వస్తాయని వివరించారు. ఈ నెల 16న మరోసారి ప్రీ బిడ్ సమావేశం ఉంటుందని.. ఈ నెల 30న 34 ప్లాట్లను విక్రయించేందుకు ఆన్లైన్ వేలం ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, తుర్కయాంజాల్ సైట్ ఇంజనీర్ ధన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.