
అబిడ్స్, జనవరి 28 : రోడ్డు భద్రతలో భాగంగా ఫ్లై ఓవర్లపై జీహెచ్ఎంసీ అధికారులు మెడియన్ మార్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ఫ్లై ఓవర్లపై వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లై ఓవర్లపై ప్రయాణించే వాహనదారులకు ఫ్లై ఓవర్ మలుపులు కనిపించే విధంగా రేడియంతో మెరిస్తే ఈ మార్కర్ల ఏర్పాటు జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని ఫ్లై ఓవర్లపై వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా మెట్రో పిల్లర్లకు మార్కర్లను ఏర్పాటు చేసి వాహనదారులు ప్రమాదానికి గురి కాకుండా చూస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ఫ్లై ఓవర్లపై ఏర్పాటు చేయగా ప్రస్తుతం టోలిచౌకి ఫ్లై ఓవర్‌పై ఏర్పాటు చేస్తున్నారు. రేడియంతో కూడిన ఈ మార్కర్లు అచ్చం లైట్ల మాదిరిగా వెలుగును ప్రసాదిస్తాయి. దీంతో వాహనదారులు మలుపులను గ్రహించి అందుకు అనుగుణంగా ప్రయాణం సాగిస్తారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ మార్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లపై వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని ఎస్ఈ తెలిపారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఫ్లై ఓవర్లపై మెడియన్ మార్కర్లు, మెట్రో పిల్లర్లకు రేడియంతో కూడిన మార్కర్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లపై స్టడ్‌ల మాదిరిగా ఈ మార్కర్లు వెలుగునిస్తాయి. దీంతో వాహనదారులు మలుపులను గ్రహించి ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మాసాబ్‌ట్యాంక్, బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్లపై కూడా వీటిని ఏర్పాటు చేస్తాం.
-సహదేవ్ రత్నాకర్, ఎస్ఈ