సుల్తాన్‌బజార్,జూన్ 1: నేను ప్రజాప్రతినిధిని.. నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి.. అంటూ ప్రభుత్వ వైద్య అధికారిపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ దంపతులు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి, దాడికి యత్నించారు. ఈ ఘటనపై సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ఇరువురు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ, ఆమె భర్త ఓంప్రకాశ్ భీష్మ, మరికొంత మంది నాయకులు బుధవారం ఉదయం 11.30 గంట లకు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు వెళ్లి సూపరింటెండెంట్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. రోగికి శస్త్ర చికిత్స చేసేది ఉందని చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తిరిగి మధ్యాహ్నం మరోసారి 20 మందితో కలిసి దవాఖానకు వెళ్లారు. ఆ సమయంలో సూపరింటెండెంట్ తన చాంబర్లో హైదరాబాద్ జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడుతున్నారు. అయినా.. బలవంతంగా చాంబర్లోకి వెళ్లారు.. “నీవసలు సూపరింటెండెంట్వేనా.. నేను ప్రజా ప్రతినిధిని, స్థానిక కార్పొరేటర్‌ను.. నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు”.. అంటూ తీవ్ర అసభ్యపదజాలంతో దూషించారు. నీ ఉద్యోగాన్ని ఊడగొడుతామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా కార్పొరేటర్ భర్త ఓం ప్రకాశ్ “నోర్ముయ్.. అంటూ మేము చెప్పిన రోగికి వైద్యం అందించాలి” అని సూపరింటెండెంట్‌ను బెదిరించాడు. బీజేపీ పార్టీ నాయకులు చెబితే చెయ్యరు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబితే వెంటనే స్పందిస్తారా.. అని వైద్యురాలిని కూడా బెదిరించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నుంచి, కార్పొరేటర్ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని, రెండు ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని ఇన్స్పెక్టర్ పద్మజ తెలిపారు.
మహిళా అధికారి అని చూడకుండా..
ఈఘటనపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలందిస్తున్న తనను పట్టుకొని తాను ఎప్పుడు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి, తాను పంపించిన రోగికి సరైన వైద్యం చేయాలి..అని దబాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి హేయమైన చర్యఅని అన్నారు.కార్పొరేటర్‌తో పాటు కార్పొరేటర్ భర్త తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ సు ల్తాన్బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.