సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో గల తన కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎకడా లేని విధంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. మొదటి విడతలో ఒకో నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఒక్కొకరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి, ఎంపిక చేసుకున్న యూనిట్లకు కేటాయిస్తారని చెప్పారు. లబ్ధిదారులకు జూన్ 10వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సమక్షంలో యూనిట్లను అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం రెండో విడత దళితబంధు కార్యక్రమం అమలుకు బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించిందన్నారు. ఇందుకుగాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి సమర్పించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు.
దళితబంధు గొప్ప కార్యక్రమం
– ఎమ్మెల్యే రాజాసింగ్
పేదరికాన్ని అనుభవిస్తున్న దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడానికి దళిత బంధు పథకం ఎంతో మేలు చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసించారు. రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నందున దరఖాస్తుల స్వీకరణ, యూనిట్ల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.
అనేక మందికి ఉపాధి అవకాశాలు
– ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్, బలాల
దళితబంధు పథకంతో అనేక మంది దళితులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినొద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పేరొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు.