అబిడ్స్, మే 30 : బేగంబజార్‌లో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల బేగంబజార్‌లో కులోన్మాద హత్యకు గురైన నీరజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇరు సామాజిక వర్గాల వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ విద్వేషాలకు పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఇరు వర్గాల వారికి సూచించారు. బేగంబజార్‌లో షాహినాయత్‌గంజ్, అఫ్జల్‌గంజ్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అరికడతారన్నారు. రాత్రి నిర్ధేశిత సమయం తరువాత దాబాలు, హోటల్లు తెరిచి ఉంచినా కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. నీరజ్ హంతకులకు చట్ట పరంగా శిక్షలు పడేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, గోషామహల్ ఏసీపీ సతీశ్‌కుమార్, షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్, రవి పాల్గొన్నారు.