మేడ్చల్, మే 30 (నమస్తే తెలంగాణ) : పట్టణ, పల్లె ప్రగతి, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పల్లెలు, మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయంతో పని చేస్తే లక్ష్యం సాధించవచ్చని అన్నారు. మూడు లేయర్లలో మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. అధికారులతో కలిసి హరితహారం కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు వివరించారు. జూన్ 3 నుంచి 18 వరకు ఉ. 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో మమేకమై హరితహారం విజయవంతం చేయాలన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు.
హరితహారంపై ముఖ్యమంత్రి దృష్టి : కలెక్టర్ హరీశ్
హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్సన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.