బడంగ్‌పేట/మహేశ్వరం, మే30 : దళితుల తలరాతలు మార్చడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలో 39 మంది దళిత బంధు పథకం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు మంత్రి సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా వెనుక బడిన దళితులను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శమని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా దళితులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు అన్ని రంగాలలో రాణించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. మొదటి దశలో నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. రెండవ దశలో రెండు వేల మందికి దళిత బంధు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, మంద జ్యోతి పాండు, వైస్ ఎంపీపీ సునీత అంజానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్‌రెడ్డి, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, రైతుబంధు సమితి నాయకులు కూన యాదయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, సహకార సంఘం చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, శివగంగా దేవాలయ చైర్మన్ సుధీర్ గౌడ్, సర్పంచ్‌లు థామస్‌రెడ్డి, రాజేశ్, ప్రియాంక రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.