చిక్కడపల్లి, మే 30: సమాజంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రదానోత్సవ సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా హరీశ్ రావు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటకే తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని, ఇండ్ల స్థలాల సమస్యను కూడా త్వరలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు.
పలు సందర్భాల్లో జర్నలిస్టులు వారి ప్రాణాలను సైతనం పణంగా పెట్టి విధులు నిర్వర్తించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ప్రధానంగా కరోనా విపత్తులో వైద్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు సమాజానికి సేవలందించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కన్నీటి గాధలను జర్నలిస్టులు వెలుగులోకి తేవడం ద్వారానే ప్రజా ప్రతినిధులుగా తాము స్పందింస్తూ వారికి చేయూతను అందించగలుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మానవీయ కోణంతో తమ కలాలకు పదును పెట్టి కథనాలు రాస్తున్న జర్నలిస్టులను ఎంపిక చేసి పురస్కారాలతో వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ, మానవత్వం కనుమరుగవుతున్న నేటి సమాజంలో మానవీయ కథనాలతో ప్రజల కన్నీళ్లు తుడిచే జర్నలిస్టులు ఉండటం శుభ పరిణామమన్నారు.
ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవీందర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాదరావు, ఆర్ఎస్ఎస్ సేవా ఫాండేషన్ ట్రస్టీ ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టులు గడ్డం సతీశ్, మ్యాకం రవి కుమార్, దాయి శ్రీశైలం, మధుకర్ వైద్యుల, నిఖిత నెల్లుట్ల అవార్డులు అందుకున్నారు.