మేడ్చల్ కలెక్టరేట్, మే 30: పల్లె పగ్రతికి సంబంధించి అధికార యంత్రాంగంతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్‌తో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు చేసే ప్రతి సూచనలు తప్పకుండా పాటిస్తున్నామని, అధికారులు పనిచేస్తున్నారని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. జిల్లాలో హరితహారం, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలకు సంబంధించి ఇప్పటికే ఎంపికలు పూర్తి చేశామని, ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని తాము ప్రణాళికబద్ధంగా చేస్తున్నామని, పల్లె ప్రగతిలో మొక్కలను ఖాళీ ప్రదేశాలలో నాటుతామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ రూపొందించామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈఓ దేవ సహాయం, డీఆర్డీఓ పద్మజరాణి, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
మేడ్చల్, మే 30(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులకు ఆదేశించారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని, మొదట కీసరలోని అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారన్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం, జిల్లా అభివృద్ధిపై ప్రసంగించనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యా నాయక్, డీసీపీ రక్షితామూర్తి, ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.