సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): బౌద్ధ మత విధానాలు అవలంబిస్తేనే దేశంలోని అంతరాలకు విముక్తి కలగడం ఖాయమని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బాలంరాయ్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో తెలంగాణ బౌద్ధ మహాసభ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారతీయ బౌద్ధమహా సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరైన మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పూర్వం మనువాదం ఆచరించిన నరబలి, పశువులను వధించడం లాంటి దుర్మార్గపు ఆచారాలతో దేశ సంపదతోపాటు ప్రజలు, వ్యాపారులు ఎంతో నష్టపోయారని చెప్పారు. రాజులు సైతం నష్టపోయి యుద్ధాలు మానేసి బౌద్ధం వైపు నడిచారని గుర్తు చేశారు. దీంతో తిరిగి భారత దేశంలో సిరిసంపదలను సృష్టించిన ఘనత బౌద్ధ మతానికి దక్కిందన్నారు. ప్రస్తుతం దేశానికి బౌద్ధ మత అవసరం ఎంతో ఉందని.. బుద్ధిజంతోనే సమాజానికి విముక్తి కలుగుతుందని అన్నారు.
అంబేద్కర్ భారత శీలశిఖరం: బొర్రా గోవర్ధ్దన్
అంబేద్కర్ భారత శీలశిఖరం అని బొర్రా గోవర్ధ్దన్ అన్నారు. ఎంతో గుణసంపన్నుడైన అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన తర్వాత మళ్లీ దేశంలో బౌద్ధం వేళ్లూనుకున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొర్రా గోవర్ధ్దన్ రాసిన ‘శీలశిఖరం’ పుస్తకావిష్కరణ (ముద్రణ లతారాజా ఫౌండేషన్) ను బీంరావు అంబేద్కర్, మల్లేపల్లి లక్ష్మయ్య, ఈమని శివనాగిరెడ్డి, చంద్రబోధి పాటిల్, హరీశ్ రావలియా, రెంజర్ల రాజేశ్, నాస్తిక్ నరేశ్, సమాంతర వరుణ్‌కుమార్, జి.పరందాములు, శీలం ప్రభాకర్, సంజీవ్‌రెడ్డి హాజరై ఆవిష్కరించారు. భారతీయ బౌద్ధ మహా సమ్మేళనానికి 2500 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాచీన భారతీయ వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాలపై పలువురు ప్రసంగించారు.