చార్మినార్, మే 30: స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ బానిస సంకెళ్లు తెంచిన యోధుల చరిత్రను మరుగున పరుస్తూ.. ఆంగ్లేయులకు తొత్తులుగా మారి నమ్మక ద్రోహానికి పాల్పడిన వారిని కీర్తించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు విచారం వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా సమాజానికి నిజాలు తెలియజేయాల్సిన నాయకులు, అధికారులు అసత్యాలను ప్రచారం చేస్తూ స్వాతంత్ర సమరాన్ని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు గాంధీ, నెహ్రూలను విస్మరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గాంధీ, నెహ్రూల చిత్రాలను చిన్నగా పెట్టి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన హెగ్డేవార్ చిత్రాన్ని పెద్దగా ఏర్పాటు చేయడం యోధులకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై సోమవారం ఆయన మ్యూజియం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇది అధికారుల తప్పిదమా? లేక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇలా చేశారా? తేలాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకటేశ్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.