సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడంలో విఫలమైతే ఈ ఠాణా ఎస్‌హెచ్‌వోపై పోలీస్ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉంచడం, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓలదే. కాగా ఓ ఠాణా పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి వ్యవస్థీకృత నేరాలను వెలుగులోకి తెచ్చారంటే ఎస్‌హెచ్‌వో నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని భావిస్తున్న నగర సీపీ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఒక ఠాణా పరిధిలో ఒకటి లేదా రెండు నేరాలు జరిగితే.. ఇతర విభాగాలు గుర్తించి పట్టుకున్నాయంటే అక్కడ పని చేసే ఎస్హెచ్ఓపై వేటు వేస్తున్నారు.
అనేక ఘటనల్లో..
– బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుడింగ్ పబ్‌పై ఏప్రిల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అయితే అప్పటికే ఆ పబ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చినా ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వహించారని అంతర్గత విచారణలో తేలడంతో వెంటనే ఇన్స్పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేస్తూ, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావును బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా నియమించారు.
– సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహించిన భిక్షపతిని సస్పెండ్ చేసిన నగర సీపీ ఆయన స్థానంలో మహిళా ఇన్స్పెక్టర్ పద్మను నియమించారు.
– రాంగోపాల్‌పేట్ ఠాణా పరిధిలోని ‘క్లబ్ టఖిలా కేఫ్ అండ్ బార్’పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 18 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అనధికారికంగా పబ్‌ను నిర్వహిస్తుండగా మూడు నెలల క్రితం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దానిపై దాడి చేశారు. అయితే ఈ ఘటనలో అంతర్గ విచారణ చేయగా స్థానిక ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం బయటపడటంతో సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.