సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌లో కులాల మధ్య చిచ్చు మొదలైన సందర్భాలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత సొంత కుంపటికి సిద్ధమైనట్లు తెలుస్తున్నదని డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికే పట్టం కట్టాలని రకరకాల ఉద్బోధలు ఇస్తున్నారన్నారు. కానీ, ఆయనకు గత చరిత్ర తెలియదని, రెడ్డీల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భాలు లేవని, కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న చెన్నారెడ్డి సమయంలో మాత్రమే విజయం సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే చెన్నారెడ్డి తరువాత మరో రెడ్డి లీడర్ రాలేదన్నారు.
కాసు బ్రహ్మానందరెడ్డి మినహా అందరూ రాయలసీమ నుంచే వచ్చారని వివరించారు. పీసీసీ పదవి, ముఖ్యమంత్రి పదవిలో రెడ్లు లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 1983లో విజయ భాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ చేతిలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందన్నారు. 1985లో రాజశేఖర్‌రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. 1989లో మాత్రమే చెన్నారెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, దానికి కారణం ఆయన బడుగు, బలహీన వర్గాలవారిని కలుపుకుని వెళ్లడమన్నారు. బడుగు, బలహీన వర్గాలు అండగా ఉంటేనే పార్టీలు గెలుస్తాయన్నారు. తాము పెట్టబోయే పార్టీలో సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికే ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.