ఒక్కసారిగా మంటలు.. ఏంచేయాలో తోచడం లేదు.. కాపాడండని ఆర్తనాదాలు.. ఎటు చూసినా గందరగోళమే. రాయదుర్గం ఖాజగూడ వై జంక్షన్‌లోని ఓ బహుళ అంతస్థు భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాహుబలి నిచ్చెన (బ్రాంటో స్కైలిఫ్ట్) 16 మంది ప్రాణాలు కాపాడింది. ఇది అందుబాటులో లేకుంటే ప్రాణనష్టంతోపాటు భారీ ఆస్తినష్టం సంభవించేది. శనివారం ఉదయం గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్ భవనం రెండో అంతస్థులో స్టోర్ రూంలో మంటలు చెలరేగి క్రమంగా నాల్గవ అంతస్థుకు విస్తరించాయి. ఇందులో పనిచేస్తున్న 16 మంది సిబ్బంది టెర్రస్ పైకెక్కి కాపాడండని పెద్దపెట్టున నినాదాలు చేయడంతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. నిమిషాల్లో చేరుకున్న బాహుబలి క్రేన్ 16 మంది ఉద్యోగులను సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు నిలిపింది. ఘటనకు షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
-సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: రాయదుర్గం డాబా చౌరస్తాలోని హైమార్క్ చాంబర్స్ భవనంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని స్టోర్‌రూమ్‌లో ఉదయం 10.20 సమయంలో దట్టమైన పొగ వచ్చిన.. కొద్దిసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. 16 మంది టెర్రస్‌పై చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణ అగ్నిమాపకశాఖకు చెందిన బ్రాంటో స్కై లిఫ్ట్ (అంతా బాహుబలి నిచ్చెనగా పిలుచుకుంటున్నారు)ను ఉపయోగించి 16 మంది ప్రాణాలు కాపాడి..వైద్యశాలలకు తరలించారు. రెండు గంటల పాటు శ్రమించి..మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం సీఐ తిరుపతి పేర్కొన్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు.
బ్రాంటో ప్రత్యేకత ఇది..
అత్యంత భారీగా ఉండే బ్రాంటో స్కై లిఫ్ట్‌తో 18 అంతస్తుల ఎత్తు వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయవచ్చు. ఈ బహుబలి నిచ్చెనను 2010లో ఫిన్‌ల్యాండ్ దేశం నుంచి తెప్పించారు. ప్రస్తుతం రెండు ఉండగా, ఒకటి సికింద్రాబాద్‌లో, మరొకటి మాదాపూర్‌లో ఉంది. ఈ బహుబలి నిచ్చెన 18 అంతస్తుల వరకు అగ్నిమాపక సిబ్బందిని సులభంగా తీసుకువెళ్తుంది. అలా వెళ్తూనే..నీళ్లను చల్లి మంటలను ఆర్పుతుంది. 18 అంతస్తులు అంటే దాదాపు 54 మీటర్లు పొడువు వరకు వెళ్లవచ్చు. ఒకేసారి ఎనిమిది మందిని పై అంతస్తుల నుంచి తీసుకురావచ్చు. ఇప్పటివరకు బ్రాంటో స్కై లిఫ్ట్‌తో కొన్ని వందల సంఘటనల్లో అగ్నికిలలు విస్తరించకుండా, పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురాగలిగారు. కూకట్‌పల్లిలో కొద్ది రోజుల కిందట ఓ ప్రైవేటు దవాఖానలో జరిగిన ప్రమాదంలో బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా రోగులు, ఇతరులను కాపాడారు. తాజాగా రాయదుర్గం అగ్ని ప్రమాద ఘటనలోనూ బ్రాంటో ఆపద్బంధువుగా నిలిచింది.