సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వైద్యసేవలు, అధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యకేంద్రాల వివరాలు, వాటి చిరునామా తదితర అంశాలను అరచేతిలోనే ఉంచే విధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ యాప్‌ను రూపొందించడంతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నది. సర్కార్ దవాఖాన అంటేనే ప్రాణాల మీద ఆశలు వదులుకునే ప్రజలకు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సర్కార్ దవాఖానలపైనే ఆశలు పెట్టుకునేలా కార్పొరేట్‌కు దీటుగా వైద్యరంగాన్ని బలోపేతం చేసింది.
అందుబాటులోకి 20 రేడియాలజి ల్యాబ్‌లు
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి దవాఖానలపై భారం తగ్గించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం అందులోనే వైద్య సేవలు, 57రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే రోగులకు ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్‌తో పాటు పూర్తిస్థాయి పరీక్షలు, వైద్యం అందించేందుకు గ్రేటర్ వ్యాప్తంగా 20 టీ-డయాగ్నొస్టిక్ మినీ హబ్‌లను (రేడియాలజి ల్యాబ్) అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టీ-డయాగ్నోస్టిక్ యాప్‌ను రూపొందించింది.
తొవ్వ చూపిస్తుంది..
టీ-డయాగ్నొస్టిక్ యాప్ ద్వారా వైద్యసేవలు, ఆరోగ్యకేంద్రాల వివరాలు, వాటి చిరునామా తదితర అంశాలను ఎవరినీ అడగకుండానే మన అరచేతిలోని సెల్‌ఫోన్‌ద్వారా తెలుసుకోవచ్చు. ‘నో యువర్ టీ-డయాగ్నొస్టిక్’ సెంటర్ ఆప్షన్‌లోకి వెళితే మనకు దగ్గరలో ఉన్న టీ-డయాగ్నొస్టిక్ సెంటర్ ఎక్కడుందో చూపిస్తుంది. జీ-మ్యాప్‌ను ఆన్‌చేస్తే దగ్గరలో ఉన్న టీ-డయగ్నొస్టిక్ సెంటర్‌కు దారి చూపుతుంది. అంతేకాకుండా యాప్‌లోనే రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది.
ఏళ్ల తరబడి మెడికల్ రికార్డులు భద్రం
ఒక్కసారి మనం ఏదైన టీ-డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుంటే ఆ పరీక్షల నివేదికలు టీ-డయాగ్నొస్టిక్ యాప్‌లోని మెడికల్ రిపోర్ట్ అనే అప్షన్లో అప్లోడ్ అవుతాయి. ప్రిస్కిప్షన్‌పై ఉండే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే సంబంధిత రోగి వైద్యపరీక్షల నివేదిక కనిపిస్తుంది. దీని వల్ల మన దగ్గర ఉన్న ప్రిస్కిప్షన్, ప్రింటెండ్ రిపోర్ట్ పోయినా ఎలాంటి సమస్య ఉండదు. అది టీ-డయాగ్నొస్టిక్ యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా 50ఏండ్ల వరకు నివేదికలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రోగి నుంచి ఫీడ్‌బ్యాక్ ఆప్షన్
అందుతున్న వైద్యసేవలు, వైద్యపరీక్షలపై రోగి నుంచి ప్రతిస్పందన తెలుసుకునేందుకు ఈ యాప్‌లో ఫీడ్‌బ్యాక్ అనే ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో వైద్యసేవలు లేదా వైద్యపరీక్షలపై రోగి తన ఫీడ్‌బ్యాక్‌ను పంపవచ్చు. దీని వల్ల సిబ్బంది పనితీరును అధికారులు అంచనా వేసే వీలుంటుంది.
ఫిర్యాదులు కూడా..
ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, వైద్యపరీక్షలకు సంబంధించి ఏవైన సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఈ యాప్‌లోని గ్రీవియన్స్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీని వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు లోపాలున్న చోట సరిదిద్దడం, నిర్లక్ష్యం జరిగేచోట చర్యలు తీసుకోవడం వంటి పర్యవేక్షణకు సైతం ఈ యాప్ అధికారులకు దోహదపడుతుంది.