బంజారాహిల్స్, మే 27: తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రంలోని పలు క్రైస్తవ సంఘాలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కోరాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను శుక్రవారం కలిసిన తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్షియల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, గ్రేటర్ హైదరాబాద్ పాస్టర్స్ అండ్ బిషప్స్, క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్, క్రిస్టియన్ అడ్వకేట్స్ అండ్ కోర్ట్ ఎంప్లాయీస్, ఆలిండియా క్రిస్టియన్ జర్నలిస్ట్ ఫోరం, ఆలిండియా దళిత క్రిస్టియన్ సంఘాల సభ్యులు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో క్రైస్తవుల కోసం శ్మశాన వాటికల స్థలాన్ని కేటాయించాలని, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల నియామకం చేపట్టాలని వారు కోరారు.
కోకాపేటలో క్రైస్తవ భవన్ నిర్మాణాన్ని చేపట్టాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. పేద పాస్టర్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. క్రైస్తవుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చూస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు బిషప్ ముల్కల భాస్కర్, సుధీర్ చాట్ల, బిషప్ చావా జోసెఫ్, రెవరెండ్ కే. ఇర్మియ, రెవరెండ్ శ్యాంసన్ అంబాల, కోటి, టీఆర్ఎస్ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర నాయకులు రాయిడన్ రోచ్ తదితరులు ఉన్నారు.