సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఆస్పత్రులున్నది సరైన చికిత్స అందించేందుకేనని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ప్రాణం బలైందని, రూ.లక్ష పరిహారం చెల్లించాలని హైదర్‌గూడ అపోలో దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు రామ్మోహన్, సి. లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రమీల భర్తకు 2014లో ఇండో- అమెరికన్ హాస్పటల్లో ఎండోస్కోపి చేయించగా, లివర్ క్యాన్సర్ అని తేలింది. దీంతో హైదర్‌గూడలోని అపోలో వైద్యశాలలో చికిత్స కోసం చేరారు. డాక్టర్లు వైద్యం అందించే క్రమంలో మూత్రపిండం వైఫల్యానికి కారణమైందని, దీంతో తీవ్ర ఆరోగ్య నష్టం జరిగిందని బాధితురాలు ప్రమీల తెలిపారు.
ఎండోస్కోపి పరీక్ష చేయకుండానే ఐసీయూలో చేర్పించారని, అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్లే వెరికిల్ బ్లీడింగ్‌తో రోగి ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. ఎండోస్కోపి పరీక్ష చేయమని వైద్యులను పదే పదే అభ్యర్థించినా.. అపోలో వైద్యులు వాయిదా వేశారు. దీంతో రోగి రోజురోజుకూ బలహీనమవుతూ.. పాదాల వాపు, ఆకలి తగ్గడం, పొత్తికడుపులో నొప్పి, నిద్రకు ఆటంకం కలగడం, శ్వాస ఆడకపోవడం, ఫ్లూయిడ్ ఓవర్‌లోడ్, ఎగువ గ్యాస్ట్రిక్ బ్లీడ్, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. సరైన వైద్యం అందించకపోవడం, నిపుణులైన ఆంకాలజిస్టులను ఏర్పాటు చేయకపోవడంతో రోగి 2014 నవంబర్ 14న మృతిచెందాడు. ఈ క్రమంలో వ్యాపార దృక్పథంతో, వైద్యచికిత్సకు విరుద్ధమైన పద్ధతులను అవలంబించారని తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య ప్రమీల హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించింది. రోగి అప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యతో ఉన్నాడని, తాము చేయాల్సిన చికిత్సను క్రమపద్ధతిలో నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు.
అన్ని అంశాలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్.. ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాల్లో తగిన ఆధారాలు ఉన్నాయని, వారు అనుభవించిన బాధలు, మానసికవేదనను దృష్టిలో పెట్టుకొని బాధితురాలికి పరిహారం చెల్లించే విషయంలో వ్యతిరేక పక్షాలు పౌర బాధ్యతను వహించాలని పేర్కొన్నది. క్యాన్సర్ ప్రాథమిక చికిత్స అయిన ఎండోస్కోపిని చేయకపోవడం, అవసరమైన చికిత్స అందించకపోవడం, ఆంకాలజిస్టులను సంప్రదించకుండా.. ప్రక్రియను అనుసరించలేదని పేర్కొన్నది. వైద్య సేవల్లో లోపం ఉన్నట్లేనని తెలిపింది. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారంతో పాటు ఖర్చుల కింద రూ.15వేలు చెల్లించాలని ఆదేశించింది. 45 రోజల్లో పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో 12 శాతం వడ్డీతో కలిపి కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.