సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): వాహనాల రాకపోకలను సులువు చేసేందుకు నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు మరింత ఆధునిక సాంకేతికతను జోడించాలని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ సంస్థ ఐబీఐ గ్రూప్ టెక్నికల్ బృందంతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మొత్తం ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 334 సిగ్నళ్లను ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 70 సిగ్నళ్ల వద్ద సాంకేతికత ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వాటిని కూడా జూలై 31 నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఆగస్టు 1 నుంచి అన్ని సిగ్నళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేయాలని జాయింట్ సీపీ నిర్వహణ సంస్థకు సూచనలు చేశారు. కాగా,ఏ రూట్లో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ వస్తుంది..? ఎంత సేపు గ్రీన్, రెడ్ సిగ్నల్ ఉండాలి..? అనే విషయం అక్కడి పరిస్థితులను బట్టి వ్యవస్థ ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. ఎంత పెద్ద సెంటరైనా 100 సెకండ్ల కంటే ఎక్కువ సేపు గ్రీన్, రెడ్ లైట్ ఒకే వైపు ఉండకుండా చూస్తారు.