సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్.. షూటింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్. లొకేషన్లకు కొదువలేని నగరం. పార్క్‌ల నుంచి హైటెక్ భవంతుల వరకు.., ఎటు చూసినా.. సుందర రమణీయదృశ్యాలే. బంధించాలనే ఆసక్తి ఉండాలేకాని మొబైల్ నిండిపోయేంత బ్యూటీ ఇక్కడి ప్రదేశాలది. అయితే ఈ ప్రదేశాలను కొంతమంది నగరవాసులు రూపాయి ఖర్చు లేకుండా షూటింగ్‌లకు వినియోగించుకుంటున్నారు. లఘుచిత్రాలు తీస్తూ తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. థీమ్‌కు తగ్గ ప్రాంతాలన్నీ నగరంలోనే బోలెడన్ని ఉండటంతో సునాయసంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. ఓయూ, ట్యాంక్‌బండ్, గోల్కొండ, హైటెక్ సిటీ, రాచకొండ, ఐటీ సెగ్మెంట్, చెరువులు, పార్కులు ఇలా ఒక్కటేమిటీ సర్వం షూటింగ్‌కు వాడేస్తూ తమ క్రియేటివిటీని బయటపెడుతున్నారు. ఎన్నో థీమ్స్‌పై షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
కెమెరాతో ఉపాధి..!!
చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు డైరెక్టర్‌గా మారిపోతున్నారు. సామాజిక సందేశాల ప్రాతిపాదికన చిన్న చిన్న నిడివిగల వీడియోలతో షార్ట్ ఫిల్మ్‌లు రూపొందిస్తున్నారు. బేగంపేటకు చెందిన ప్రకాశ్‌కు షార్ట్ ఫిల్మ్‌లు తీయడం ఆసక్తి. అతడు నగరంలోని ఓ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న ఆలయ సౌందర్యాన్ని తన సెల్ఫోన్లో షూట్ చేశాడు. ఆ వీడియోను స్నేహితులకు పంపించాడు. వాళ్లంతా చాలా బాగుందని ఆ ఆలయం అడ్రస్ చెప్పమని కోరారు. ఆ వీడియోకు వచ్చిన స్పందనతో తనలో యూట్యూబ్ చానల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. దానికి కెమెరాతో జీవం పోశాడు. అలా ప్రారంభమైన యూట్యూబ్ చానల్లో కొద్ది కాలంలోనే వేలాది సబ్‌స్ర్కైబర్స్ చేరడం విశేషం. ఫలితంగా అతడు ఉపాధిని కూడా పొందుతున్నాడు. శరత్, దీపిక, నలిని, స్వాతి స్నేహితులు. వీరు ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తూ అందమైన లఘు చిత్రాలను నిర్మిస్తూ ఉపాధి పొందుతున్నారు.
లొకేషన్లు కథలను పుట్టిస్తాయి
లక్షల చిత్రాలు వచ్చినా.. ప్రతి సినిమాలో చూసినా.. వన్నె తగ్గని అందం హైదరాబాద్‌ది. నగరంలోని పలు లొకేషన్లు మంచి కథలను పుట్టించే ఆలోచనలను కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని అందమైన ప్రాంతాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అది మన అదృష్టం. ఇక్కడ పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తూ వాటి ఆధారంగా తీసిన వీడియోలతో కూడా షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించవచ్చు. సెల్‌ఫోన్ ఉంటే చాలు కథలు సిద్ధం చేసే లొకేషన్లు బోలేడు ఉన్నాయి.
– విజయ్ భాస్కర్, సినిమాటోగ్రాఫర్.
యాక్సిడెంట్ ప్రమాదాలపై వీడియో
రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మరణిస్తున్నారు. ఒకరి నిర్లక్ష్య డ్రైవింగ్ మరొకరికి శాపంగా మారుతుంది. కుటుంబంలో ఓ వ్యక్తి మరణిస్తే ఎంతటి బాధ ఉంటుందో తెలియజేసే సందేశాన్ని మేం మా లఘుచిత్రంలో చూపించాం. అందుకు నగరంలోని కొన్ని ప్రాంతాలను, ఫ్లైఓవర్లను వినియోగించుకున్నాం. నగరంలో ఏ కథకైనా సరిపడా లొకేషన్లు ఎన్నో ఉన్నాయి.
-ప్రకాశ్, లఘుచిత్ర రూపకర్త.
చేతిలో సెల్ ఉంటే చాలు
హైదరాబాద్ ప్రతి ఒక్కరిలోని ట్యాలెంట్‌ను బయటకు తీస్తుంది. ఇక్కడ ఉన్న వాతావరణం అలాంటిది. సినిమా విషయానికి వస్తే నేను హైదరాబాద్ లొకేషన్లలో తీసిన చాలా సినిమాలకు ఆడియో వర్క్ చేశాను. చాలా మంది యంగ్ స్టార్స్ కెమెరాలతో సందేశానిచ్చే చిత్రాలను తీసి ఔరా అనిపిస్తున్నారు. సాధరణంగా ఆ లొకేషన్లు లఘుచిత్రాల్లో చూపించాలంటే లక్షల్లో ఫీజు ఉంటుంది. మన నగరంలో అవి పర్యాటకంగా ఉండటం అందరికి కలిసొచ్చింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు చిన్నపాటి చిత్రం చూపించొచ్చు.
– డాక్టర్ సాజిదాఖాన్, షార్ట్‌ఫిల్మ్ రూపకర్త, ఆడియో ఇంజినీర్.