దుండిగల్/ జీడిమెట్ల, మే 27 : కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామ పక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వామ పక్షపార్టీల ఆధ్వర్యం లో కుత్బుల్లాపూర్ మండల తాసీల్దార్ సంజీవరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ బడా పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూర్చుతుందన్నారు. 14 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ మండల కార్య దర్శి ఉమామహేశ్, సీపీఎం మండల కార్యదర్శి కీలకానీ లక్ష్మణ్, సీపీఎంఎల్ నాయకులు ప్రవీ ణ్, వామ పక్ష నాయుకులు జార్జ్ , హరినాథ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
దుండిగల్‌లో.. అధిక ధరలు, పన్నుల భారంతో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం బాచుపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా నుంచి తేరుకునే లోపే కేంద్రప్రభుత్వం ప్రజలపై పన్నులు, నిత్యావసరాల ధరలను పెంచి మోయలేని భారం మోపిందని, ఒక వైపు కోట్లాది రూపాయల రాయితీలను పెట్టుబడిదారులకు కల్పిస్తూ మరో వైపు సామాన్య ప్రజలపై పన్నల మోత మోగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నాయకులు బాలపీరు, అంజయ్య, అశో క్, మల్లయ్య, బాలయ్య, శివ, కరుణాకర్‌రెడ్డి, రాజయ్య, యాదయ్య, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.