ఘట్కేసర్,మే 26 : పోచారం మున్సిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో చేపట్టిన వివిధ ప్రభుత్వ భవనాల పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మంత్రి మలారెడ్డి ప్రారంభించడానికి అధికారులు, పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలు..
మున్సిపాలిటీ పరిధి..5వ వార్డులో రూ.40లక్షలతో అన్ని సౌకర్యాలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. జిల్లాలోనే అన్ని వసతులతో రెండు అంతస్తులతో తీర్చిదిద్దారు.11వ వార్డులో రూ.30 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని మున్సిపాలిటీ నిర్మించింది. ఈ ఉప కేంద్రం అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే 5వ వార్డులో డ్వాక్రా భవనాన్ని రూ.20లక్షలతో మొదటి అంతస్తుతో పాటు , అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. ఈ భవనం పరిధిలోకి వచ్చే మహిళా గ్రూపు సభ్యులు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. మూడు భవనాలు నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రజారోగ్యానికి పంచతత్వ పార్కు..
మున్సిపాలిటీ పరిధి.. 3వ వార్డులో రూ.15 లక్షలతో చేపట్టిన పంచతత్వ పార్కును ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అభివృద్ధి చేశారు. ఎల్ఐజీ కాలనీ పార్కు స్థలంలో తీర్చిదిద్దారు. ఈ పార్కులో ఆరోగ్య ప్రదాయిని మొక్కలైన రణపాల, క్రిష్ణతులసి, అలోవెరా, ఇన్సూలెన్, లెమన్‌గ్రాస్, అశ్వగంధ తదితర మొక్కలను పెంచుతున్నారు. దీంతో పాటు ఉదయం నడక కోసం కంకర, మట్టి, చెక్కపొడి, బంకమట్టి, మెత్తని గడ్డి, నీరు వంటివి ఏర్పాటు చేశారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
పోచారం మున్సిపాలిటీని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం. మౌలిక వసతులు, హరితానికి ప్రాధాన్యతనిస్తున్నాం.
-బి.కొండల్‌రెడ్డి, చైర్మన్, పోచారం మున్సిపాలిటీ