మేడ్చల్, మే 27(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 39వేల 613 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రూ.7.75 కోట్ల విలువైన ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయగా రూ. 4.20 కోట్లను రైతుల ఖాతాల్లో అధికారులు జమ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వివిధ రకాల సౌకర్యాలు కల్పించారు. మాదారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం, లక్ష్మాపూర్, కేశవరం, ఉద్దెమర్రి, కీసర, మేడ్చల్, డబిల్పూర్, శామీర్పేట్, పూడూర్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
7684 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా…18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. 18 వేల మెట్రిక్ టన్నులకు గాను రూ.25 కోట్లు రైతులకు చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించనున్నామని వెల్లడించారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.