కేపీహెచ్‌బీ కాలనీ, మే 27: రెండంతస్థుల భవనం బాల్కని నుంచి దూకి పారిపోయేందుకు యత్నించిన వ్యక్తి మరణించిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ, ఎస్సైలు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా సోహస గ్రామానికి చెందిన సుశీల్ కుమార్ గుప్త(39) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. కార్పెంటర్‌గా పనిచేస్తూ.. బోరబండ రాజీవ్‌గాంధీ నగర్లో నివసిస్తున్నాడు. శ్రీరామ్‌నగర్ కాలనీ సూర్యతేజ రెసిడెన్సి ఫ్లాట్ నెం: 203లో కార్పెంటర్ పని చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌తో సుశీల్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 204 ప్లాట్‌లో నివసించే శ్రీధర్‌తో పాటు మరో ఇంట్లో పనిచేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు తీసుకుని, పని చేయకుండా తప్పించుక తిరుగుతున్నాడు.
ఒకరి కోసం తెచ్చిన వస్తువులను మరొకరికి వాడటం, ఒప్పందం ప్రకారం, పని పూర్తి చేయడం లేదు. కొంత కాలంగా తప్పించుక తిరుగుతున్న సుశీల్ కుమార్‌ను శుక్రవారం చంద్రశేఖర్, తన బైక్‌పై శ్రీరామ్‌నగర్‌లోని అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చాడు. చంద్రశేఖర్‌తో పాటు శ్రీధర్, తిరుమలేశ్లు కలిసి ఒప్పందం కుదుర్చుకున్న మూడు ఇండ్లలో పని ఎప్పడు పూర్తి చేస్తావని అతడిని ప్రశ్నించారు. భయపడి పారిపోయేందుకు సుశీల్ కుమార్ ఇంటి రెండో అంతస్థులోని కిచెన్ బాల్కని నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా… ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని సమీపంలోని వైద్యశాలకు తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.