శేరిలింగంపల్లి, మే 27: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెం.58, 59ల ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. శేరి లింగంపల్లిలోని గోపీనగర్ కాలనీలో జీవో నెం: 58 కింద దరఖాస్తులు చేసుకున్న ఆక్రమిత ఇళ్లను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, శేరి లింగంపల్లి తహసీల్దారుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఆక్రమిత ఇండ్లు కలిగిన వారిని గుర్తించి సర్వే పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారుల ఆదేశించారు. ఈ దిశగా 58 కింద గోపీనగర్లో వచ్చిన దరఖాస్తులను అధారంగా చేసుకొని సర్వే పనులను వెంటనే చేపట్టాలన్నారు. జీవోకు దరఖాస్తు చేసుకున్న అసలైన లబ్ధిదారులను గుర్తించి పట్టాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన
జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలను ఏర్పాటు చేశారు. జీవో 58 కింద జిల్లా వ్యాప్తంగా 19,692 దరఖాస్తులు రాగా, అత్యధికంగా శేరి లింగంపల్లి మండలంలో 6,485 దరఖాస్తులు, బాలాపూర్ మండలంలో 4,124 దరఖాస్తులు వచ్చాయి.