బంజారాహిల్స్, మే 22: ఓ ఎన్ఆర్ఐ స్థలాన్ని కొట్టేసేందుకు ఫోర్జరీ పత్రాలను సృష్టించడంతో పాటు ఏకంగా తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి టెలీకామ్నగర్కు చెందిన న్యావనంది పూర్ణచందర్ అమెరికాలో సాఫ్ట్వేర్ కన్సెల్టెన్సీ నిర్వహిస్తున్నారు. నగరంలో సంస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏడాదిన్నర కిందట షేక్‌పేట సర్వే నం. 129/40/1లోని బంజారాహిల్స్ రోడ్ నం. 13లో 2538 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కొందరు వ్యక్తులు ఈ స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించడంతో పాటు ఆక్రమణకు ప్రయత్నించడంతో కోర్టును ఆశ్రయించగా, బాధితుడికి అనుకూలంగా మద్యంతర ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఈ వ్యవహారంపై బాధితుడు ఆరా తీయగా, ఈ స్థలాన్ని కాజేసేందుకు సింగిరెడ్డి వీర హనుమాన్‌రెడ్డి, బూరుగు సత్యనారాయణగౌడ్, కర్ల హరికృష్ణారెడ్డి. బాలప్రవీణ్, రేవా ఇన్ఫ్రా , దీపక్ దేశ్‌ముఖ్ తదితరులు పథకం రచించినట్లు తేలింది.
ఈ స్థలం యజమాని ఖదీర్ భేగం అలియాస్ ఖదీరున్నీసా బేగం అంటూ తప్పుడు పత్రాలు సృష్టించారు. ఖదీర్ బేగం అంటూ ఓ మహిళను తీసుకెళ్లి 129/15 అనే దొంగ సర్వేనంబర్‌ను చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఖదీర్ బేగం తమకు ఈ స్థలాన్ని అమ్మారంటూ నమ్మించడంతో పాటు కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 11న బాధితుడు పూర్ణచందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సింగిరెడ్డి వీర హనుమాన్రెడ్డితో సహా మొత్తం 15మందిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. పి.సురేందర్. దొంతుల సుధాకర్, మోయిజుద్దీన్, ముజాహిదీన్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.