మెహిదీపట్నం, మే 22 : ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ అధికారులు నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్లలో గుంతలు గుర్తిస్తూ బీటీ రోడ్లను ఆధునీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ -12, 13 ప్రాంతాల్లో ఇంజినీరింగ్ విభాగం అధికారులు సంబంధిత కాంట్రాక్టులు తీసుకున్న కంపెనీలకు మార్గ దర్శకాలు చేస్తూ పనులను పూర్తి చేస్తున్నారు. మెహిదీపట్నం, టోలిచౌకి, నానల్నగర్ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని ఖైరతాబాద్ జోనల్ ఎస్ఈ రత్నాకర్ సహదేవ్ తెలిపారు.
బీటీ రోడ్ల పనులు పూర్తి..
ఒలీవ్ దవాఖాన నుంచి నానల్నగర్ మీదుగా లక్ష్మీనగర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రధాన రోడ్డులో జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున బీటీ రోడ్ల పనులను పూర్తి చేశారు. టోలిచౌకి బృందావన్ కాలనీ వద్ద ప్రధాన రోడ్డులో బీటీ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టినట్లు ఎస్ఈ రత్నాకర్ సహదేవ్ తెలిపారు. ప్రధాన రోడ్లలో గుంతలను పూడ్చి కొత్తరోడ్లను వేస్తున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా సిబ్బంది రాత్రివేళల్లో పనులు చేస్తున్నారు.