పీర్జాదిగూడ, మే : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 2021-22 పట్టణ ప్రగతిలో భాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో మొక్కలు నాటి పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 22 పట్టణ ప్రకృతి వనాల్లో 35 వేల మొక్కలు నాటారు. ఇందులో పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటారు. పాలకవర్గం ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో అవి ఏపుగా పెరిగాయి. ప్రకృతి వనాలకు వచ్చే ప్రజలు సేద తీరడానికి బెంచీలు, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రకృతి వనాలతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరంగా ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్‌కు హరిత శోభ..
పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతలో ముందుకు దూసుకెళ్తున్నది. ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. వనాల్లో మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదంతో పాటు పచ్చని శోభ సంతరించుకున్నది. ప్రజలు, చిన్నారులకు ఆరోగ్యం, ఆనందాన్ని కలిగించడానికి ప్రకృతి వనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.క్రీడా పరికరాలు కూడా ఏర్పాటు చేశాం.
– జక్క వెంకట్‌రెడ్డి,మేయర్, పీర్జాదిగూడ