బేగంపేట్ మే 22: బేగంపేట్ నాలా పరిసర ప్రాం తాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆదివారం మోండా మార్కెట్ డివిజన్లో రెండు చోట్ల, బేగంపేట్ డివిజన్లో ఎనిమిది చోట్ల రూ. 4.54 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా మోండా మార్కెట్ నాలా బజార్లో రూ. 72 లక్షలతో చేపట్టనున్న బాక్స్డ్రైన్ పనులు, అలాగే షోలాపూర్ స్వీట్ హౌజ్ వద్ద రూ. 98 లక్షలతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు , బేగంపేట్ డివిజన్లోని ఎన్బీటీ నగర్లో కమ్యూనిటీ హాల్, ఫుట్‌పాత్ అభివృద్ధి పనులు, వికార్‌నగర్ కట్టెల మండి వద్ద వీడీసీసీ రోడ్డు, సీవరేజీ , చీరాన్ ఫోర్ట్ క్లబ్ వద్ద రూ. 35 లక్షలతో వీడీసీసీ రోడ్డు, బ్రాహ్మణవాడిలోని సీత అపార్ట్మెంట్ వద్ద రూ. 45 లక్షలతో సీసీ రోడ్డు, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో రూ. 31 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డును ప్రారంభించారు. అంతర్గత రహదారులను సీసీ రోడ్డుగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎస్ఎన్డీపీ కింద రూ. 45 కోట్లు మంజూరు చేసిందని ఆ నిధులతో నాలాకిరువైపులా రిటైనింగ్ వాల్వ్, పరిసర ప్రాంతాల్లో రోడ్లు సీవరేజీ లైన్‌ను నిర్మించనున్నట్లు వివరించారు. ఇప్పటికే నాలా పూడిక తీత పనులు కొనసాగుతున్నాయన్నారు. నాలాను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
మహిళలు ఆర్థికంగా ఎదగాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్లోని ఎంబీటీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో టీఆర్ఎస్ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణను అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆదివారం మంత్రి తలసాని సర్టిఫికెట్లను అందించారు. కార్పొరేటర్ మహేశ్వరి పాల్గొన్నారు.