అంబర్‌పేట, మే 22: అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా బస్తీల్లో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఆదివారం సమస్యలను స్వీకరించారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఓ మహిళ తనకు, తన సంతానానికి ఆధార్ కార్డులు లేవని, ఆధార్‌కార్డులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరింది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత వారితో మాట్లాడి ఆధార్ కార్డు ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచినీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి, కొత్త పైపులైన్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు రూ.20 కోట్ల బడ్జెట్ కేటాయించి పనులు చేయించడం జరిగిందని తెలిపారు.
అక్కడక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెల్లవారు జామున బస్తీలలో స్వయంగా తిరుగుతూ మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తూ కలుషిత మంచినీటి సమస్యను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి అదే రోజు సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గంలో గత 15 ఏండ్లలో జరగని అభివృద్ధి ఈ మూడేండ్ల కాలంలో జరిగిందని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఫుట్‌పాత్‌లు, పార్కుల అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అనిల్, మధుసూదన్‌రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.