సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): వినియోగదారుడికి రూ.59,439.51 తిరిగి చెల్లించాలని సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 బెంచ్ ఆదేశించింది. నష్టపరిహారం కింద రూ.10వేలు, మరో రూ.5వేలు ఖర్చుల కింద అందజేయాలని సూచించింది. సికింద్రాబాద్‌కు చెందిన పి.సురేందర్ 2019లో సామ్సంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేశాడు. టీవీ పాడవ్వడంతో సామ్సంగ్ కంపెనీకి తెలియజేశాడు. మార్పిడి చేసి ఇవ్వాలంటే మరో రూ.25014 చెల్లించాలని సంబంధిత ఇంజినీర్ తెలిపాడు. వ్యారంటీ ఉండటంతో బాధితుడు వినియోగదారుల కమిషన్-2ను ఆశ్రయించాడు. కమిషన్-2 అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యుడు పీవీటీఆర్ జవహర్‌బాబుతో కూడిన బెంచ్ కేసు పూర్వాపరాలను పరిశీలించి.. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
ఐసీఐసీఐ బ్యాంకుకు..
సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): బాధితుడికి రూ.1,05,904 నగదును చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 ఆదేశించింది. కపిల్ అగర్వాల్ అనే ఓ వ్యాపారి అబిడ్స్‌లోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కరెంట్ ఖాతాను కలిగి ఉన్నాడు. 2019లో ఆర్టీజీఎస్ ద్వారా ఓడ్ జాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1,05,904 బదిలీ చేశాడు. ఖాతా నంబర్ తప్పుగా రాయడంతో ఆ మొత్తం పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా కలిగిన వేరొకరికి వెళ్లింది. జరిగిన పొరపాటును రెండు బ్యాంకుల అధికారులకు తెలియజేశాడు.
స్పందించకపోవడంతో బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2ను ఆశ్రయించాడు. ఐసీఐసీఐ బ్యాంకు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినా మాట నిలబెట్టుకోలేకపోయింది. విచారణకు సైతం ఆ బ్యాంకు అధికారులు కమిషన్ ముందు హాజరవ్వలేదు. ఈ క్రమంలో కమిషన్-2 అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యుడు పీవీటీఆర్ జవహర్‌బాబుతో కూడిన బెంచ్ బాధితుడికి రూ.1,05,904 నగదును 9శాతం వడ్డీతో చెల్లించాలని ఐసీఐసీఐను ఆదేశించింది. ఆలస్యం, ఆవేదన, నష్టపోయినందుకు రూ.25వేలు, కేసు ఖర్చుల కోసం మరో రూ.10వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. దావా కేసు నుంచి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు మినహాయింపు ఇచ్చింది.