అబిడ్స్/సుల్తాన్‌బజార్, మే 21: బేగంబజార్‌లో శుక్రవారం జరిగిన కులోన్మాద హత్య కేసును షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఓ మైనర్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. శనివారం షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు. కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్(22) పల్లీల వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన సంజనను 2021 ఏప్రిల్ 13న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇటీవల బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్ పన్వార్‌ను హతమార్చాలని పథకం పన్నారు.
శుక్రవారం రాత్రి బేగంబజార్ చేపల మార్కెట్ ప్రాంతంలో కాపు కాచి కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. రక్తం మడుగులో పడి పోయిన నీరజ్‌ను ఉస్మానియా దవాఖానాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌తో సహా మొత్తం ఏడు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా అభినందన్ యాదవ్ (26), విజయ్ యాదవ్ (22), సంజయ్ యాదవ్ (25), రోహిత్ యాదవ్ (18), మహేశ్ అహీర్ యాదవ్ (21)తో పాటు బాలుడు హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వారిని పరిగి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా, నీరజ్ మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతుడి నివాసానికి తరలించారు. అంతకుముందు హతుడి భార్య సంజన తన రెండు నెలల కుమారుడు, బంధువులతో కలిసి షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీసీపీ జోయల్ డేవిస్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.