సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని, నమోదు చేసుకోని వారి నుంచి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నల్లా బిల్లులు, బకాయిలను వసూలు చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ నిర్ణయించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ 4.2 లక్షల మంది వినియోగదారులు అర్హత ఉండి కూడా ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోలేదని ఎండీ వెల్లడించారు. వీరికి నమోదుకు 13 నెలల వెసులుబాటు కల్పించినట్లు చె ప్పారు. ఈ నేపథ్యం లో పథకానికి నమో దు చేసుకోని వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేయాలని ఉన్నతాధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
ఎప్పుడైనా నమోదుకు అవకాశం
ఇప్పటికే మొత్తం గృహవసరాల వినియోగదారులకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు 13 నెలల బిల్లులను ప్రభుత్వం రూ.520 కోట్లు మాఫీ చేసినట్లు దానకిశోర్ తెలిపారు. పని చేయని మీటర్లు ఉన్న కనెక్షన్లను గుర్తించి.. కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులకు ఎండీ సూచించారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.
ముందుగా నోటీసులు ఇచ్చి..
2020 డిసెంబరు కంటే ముందు ఉన్న బకాయిలను సైతం వసూలు చేయాలని ఆదేశించారు. ఉచిత నీటి పథకానికి నమోదు కాని వారు బకాయిలు చెల్లించాలని సూచిస్తూ ముందుగా నోటీసులు ఇవ్వాలని ఎండీ ఆదేశించారు. త్వరలో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్షన్ల వారీగా చేపట్టాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.