సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : అసాధారణ ప్రతిభతో ఇద్దరు చిన్నారులు రికార్డులు సృష్టిస్తున్నారు. సూపర్ మెమోరీ పవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రతిభకు మరో పేరైన పదేండ్లలోపు సోదరీమణులు ఖేయ గౌరీ శెట్టి, ఇష్య గౌరీ శెట్టి విశ్వనగరమైన హైదరాబాద్‌కు పేరు తెచ్చారు. కన్నవారికి గర్వకారణంగా నిలిచారు. 9 ఏండ్ల ఖేయ వివిధ దేశాలకు చెందిన 100 పతాకాలను, 195 దేశాల మ్యాపులను చకచకా గుర్తించడంతో పాటు గుక్క తిప్పుకోకుండా వర్ణిస్తుంది. 54 మంది నేతలు, 36 మంది ప్రసిద్ధ వృత్తి నిపుణుల గురించి వివరించి సూపర్ కిడ్, జీకే క్వీన్ వంటి బిరుదులు పొందడం విశేషం. ఇక జాగ్రీఫ్ విజార్డ్గా పేరు పొందిన ఏడేళ్ల ఇష్య అనేక సంస్థలు నిర్వహించిన ప్రతిభా ప్రదర్శనలో పాల్గొని ప్రపంచ పటంలోని 195 దేశాలను ఒక నిమిషం 55 సెకన్లలో, 100 దేశాల పతాకాలను ఒకటిన్నర నిమిషంలోనే గుర్తించి రికార్డు సృష్టించింది. వాళ్ల అపారమైన జ్ఞాపకశక్తితో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అదే క్రమంలో చిన్నారి ఇష్య కేవలం పతాకాలను చూస్తూ 100 దేశాల పేర్లను రెండు నిమిషాల్లో చెప్పి అందరిని విస్మయపరుస్తున్నది. వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ రికార్డ్స్, తెలుగు బుక్ రికార్డ్స్, సూపర్ కిడ్ రికార్డ్స్, క్రియేటివ్ రికార్డ్స్ వంటి సంస్థలు ఇష్య ప్రతిభను పరీక్షించి ప్రశంసలతో ముంచెత్తాయి.
మా బిడ్డల కోసం సరైన ప్రణాళిక: వరుణ్, లలిత (తల్లిదండ్రులు)
లాక్డౌన్ సమయంలో నాలుగు గోడల మధ్య కాలం గడిపిన సందర్భంగా చిన్నారుల ప్రతిభను పరీక్షించే అవకాశం దొరికింది. వారిని ప్రోత్సహించాం. మా చిన్నారులకు ఓ కాల పట్టికను రూపొందించాం. ఆహారం తీసుకోవడం, ఆడుకోవడం, నిద్రపోవడం.. సమయానుసారం జరిగేలా చూస్తూ, ఓ నెల రోజుల తర్వాత ఇంటిలోనే గట్టి శిక్షణ ఇచ్చాం. వాటన్నింటిని పాటించి మా చిన్నారులు అద్భుత రికార్డులను సాధిస్తుండటం మాకు ఆనందంగా ఉంది. వీటితో పాటు నాట్యం, స్కేటింగ్, గుర్రపు స్వారీ, సంగీతం, చిత్ర లేఖనం, ప్రకృతిని అధ్యయనం చేయడం.. లాంటి వాటిలోనూ మా పిల్లలకు టాలెంట్ ఉంది.