జూబ్లీహిల్స్, మే 20: గోశాలలను కుటీర పరిశ్రమలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకుగానూ ప్రత్యేక నిధుల కేటాయింపు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నామని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు. గ్రా మీణ ప్రాంతాలలో ఖాదీ పరిశ్రమల స్థాపనతో పాటు ప్రణాళికాబద్ధంగా అవగాహన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యూసుఫ్‌గూడ నిమ్స్ మేలో ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన – గోశాలల నిర్వహణ’పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కేవీఐసీ కార్యక్రమాల అమలులో గోశాల యజమానుల బాధ్యత ఎక్కువగా ఉండాలని సౌత్ జోన్ సభ్యుడు శేఖర్ రావు పేరాల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం, నిమ్స్ మే ప్రాంగణంలో నాంపల్లి గాంధీ భవన్ నుంచి తరలించిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఆర్ఎస్ పాండే, క్షేత్ర గోరక్ష ప్రముఖ్ యాదగిరి రావు, అఖిల భారతీయ గో సేవా ప్రముఖ్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 200 గోశాల యజమానులు పాల్గొని పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.