మేడ్చల్, మే 20(నమస్తే తెలంగాణ): ఖరీఫ్ సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేలా సిద్ధం చేసిన ప్రణాళికను రైతులు అమలు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వరి పంటతో పాటు ఆరుతడి, ఉద్యానవన పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా లాభాలు గడించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికను సిద్ధం చేశారు. 30 వేల ఎకరాలలో సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎరువులకు సంబంధించి యూరియా 1348, డీఏపీ 350, కాంప్లెక్స్ 1686 మెట్రిక్ టన్నుల సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి మేరీ రేఖ తెలిపారు. అవసరమైతే మరిన్ని ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విత్తన కంపెనీలలో తనిఖీలను నిర్వహిస్తున్నారు.
ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్ సాగు ప్రణాళిక సిద్ధం చేశాం. జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు చేసేలా రైతులకు సూచిస్తున్నాం. ముఖ్యంగా వరితో పాటు ఇతరత్రా పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యానవనాలు, కూరగాయల పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా చూస్తున్నాం. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాం.
– మేరీ రేఖ, జిల్లా వ్యవసాయాధికారి