సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. సెల్లార్ తవ్వకాలపై తక్షణం నిషేధాన్ని విధిస్తూ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాకాలం ముగింపు వరకు ఈ ఉత్తర్వులు అమల్లోకి ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే తవ్వకాలు జరిపి ఉంటే.. వానకాలం పూర్తయ్యే వరకు వాటి వద్ద తగిన జాగ్రత్తలు పాటించేలా యజమానులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని పక్కాగా ఆమలు చేయాలని సంకల్పించారు. ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అలాగే శిథిల భవనాలపై కూడా దృష్టి సారించారు. గతేడాది కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలతో పాటు పురాతన వాటిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి ప్రమాదకరంగా ఉంటే.. నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు శిథిల భవనాలు, సెల్లార్ గోతులపై మార్గదర్శకాలు విడుదల చేశారు.
లోపాలున్నట్లు తేలితే..
వర్షాకాలంలో ప్రమాదాలకు తావులేకుండా కమిషనర్ ఆదేశాల ప్రకారం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పారు. ముఖ్యంగా సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించడమే కాకుండా ప్రహరీల ప్రమాదాలకు సంబంధించి గత అనుభవాలు పునరావృతం కాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి కూల్చివేస్తామన్నారు. గతంలో నోటీసులు ఇచ్చిన భవనాలను తనిఖీ చేపడుతామని, మరమ్మతులు సూచించడమో, లేక సీల్ చేయడమో చేస్తామన్నారు. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను ప్రణాళిక విభాగం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారని, రక్షణ చర్యల్లో లోపాలున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్గదర్శకాలు ఇవి..
సమగ్ర నివేదికకు ఆదేశం
భవన నిర్మాణ ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇటీవల సమీక్షలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, 25వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని డిప్యూటి సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లకు ఆదేశాలు జారీ చేశారు.