మియాపూర్, మే 19 : పట్టణ ప్రణాళికా విభాగంలో నెలకొన్న కోర్టు కేసులపై కౌంటర్లు దాఖలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి ఆదేశాల అనంతరం భవనాలపై తగు చట్టపరమైన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్లో నిర్మాణ సంబంధ అంశాలపై నమోదైన కోర్టు కేసులపై స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదులు, డీసీలు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జడ్సీ గురువారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిళ్ల వారీగా నమోదైన కోర్టు కేసులపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్ని కేసులలో కౌంటర్లు దాఖలు చేశారని, ఎన్ని భవనాలపై చర్యలు తీసుకున్నారనే విషయంపై నిశితంగా సమీక్షించారు. జోన్ వ్యాప్తంగా నాలుగు సర్కిళ్ల పరిధిలో కలిపి మొత్తం 1763 వరకు కోర్టు కేసులకు గాను 1531 కేసులలో అధికారులు కౌంటర్లు దాఖలు చేసినట్లు గుర్తించారు. ఇంకా 232 వరకు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉందని జడ్సీ పేర్కొన్నారు.
జోన్ పరిధిలో చందానగర్ సర్కిల్లో అత్యథికంగా 958, శేరిలింగంపల్లి సర్కిల్లో 648 కేసులు, యూసుఫ్‌గూడలో 99, పటాన్చెరు 58 నిర్మాణాలపై కోర్టు కేసులు నమోదు కాగా.. వీటిలో 85శాతానికి పైగా అధికారులు కౌంటర్లు దాఖలు చేశారని, మిగిలిన వాటిపైనా ప్రక్రియ పూర్తి చేయాలని జడ్సీ శంకరయ్య పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునేలా కోర్టుకు పక్కాగా పత్రాలు సమర్పించాలని, తుది నిర్ణయం అనంతరం వాటిని కూల్చేయాలన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎప్పటికపుడు కోర్టు కేసుల పురోగతిని తెసుకుంటూ తదుపరి చర్యలు చేపట్టాలని జడ్సీ శంకరయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, సీపీ ఉమాదేవి, ఎస్ఈ శంకర్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, స్టాండింగ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.