చిక్కడపల్లి, మే 18: సహకార బ్యాంకులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సహకార ధర్మ పీఠం ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ‘సహకార బ్యాంకుల రక్షణ’పై సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నదని, సహకార బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయడానికి చట్టం తీసుకురావడం దారుణమన్నారు. సహకార బ్యాంకుల రక్షణ కోసం ప్రజాప్రతినిధులు, రైతులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సహకార బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. సహకార ధర్మపీఠం ధర్మకర్త సంభారపు భూమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, నాబార్డు విశ్రాంత సీజీఎం మోహన్య, ఎండీ సర్దార్, శశిమోహన్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.