రవీంద్రభారతి, మే 18: తెలుగు సినిమాలు, నాటకరంగాల్లో తెలంగాణవాదం ఇంకా బలపడాలని భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ నాటక రివర్టరీ సంయుక్తాధ్వర్యంలో వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓవర్ డబ్బింగ్ శిక్షణ తరగతులు రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా ముగిశాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రతి విభాగంలోనూ కనిపిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై ఆన్లైన్ వేదికగా శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు భవిష్యత్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ నాటక రివర్టరీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్కిషన్గౌడ్, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.