ఆర్కేపురం, మే 18: కన్న బిడ్డల ఆదరణకు నోచుకోని నిరుపేద తల్లులు… తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిన వితంతువులు.. తల్లిదండ్రుల ఆదరణ లేక రోడ్డున పడిన ఆడబిడ్డలు.. భర్త వదిలేసిన భార్యలు.. మతిస్థితిమం లేని మహిళలు.. ఇలా ఒంటరి మహిళలకు సరూర్‌నగర్‌లోని నైట్ షెల్టర్ ఫర్ హోమ్‌లెస్ పీపుల్ ఆశ్రయం కల్పిస్తుంది. ఒంటరి మహిళలకు నీడన్విడమే కాకుండా మూడు పూటలా కడుపునిండా భోజనం పెట్టి ఆదరిస్తున్నది. నేనున్నాను.. అంటూ ఓదార్పునిస్తున్నది.
చివరి మజిలిలో ఏ ఆదరణ లేని వృద్ధులకు, ఇతర ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2013లో భారతీ మహిళా సంఘం ఆధ్వర్యంలో సరూర్‌నగర్ డివిజన్ చౌడివద్ద ఉన్న ప్రభుత్వ భవనంలో నైట్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఎవరూ లేని ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తొమ్మిదేళ్లలో 250-300 మందికి నీడ కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ 16 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఒకరికొకరు తోడు నీడలా ఉంటున్నారు. ఒకరి బాధను మరొకరితో పంచుకుంటూ ఒంటరితనాన్ని మర్చిపోతున్నారు.
కొత్త భవనం ఏర్పాటు చేయాలి
ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 20 మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. కొత్తభవనం ఏర్పాటు చేస్తే మరింత మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వారికి మూడు పూటలా మంచి భోజనం పెడుతున్నాం. జబ్బులతో బాధపడుతున్నవారికి ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నాం.
– సాజిదా, హోం నిర్వాహకురాలు
ఆశ్రయానికి రుణపడి ఉంటాం
మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు కూడా లేరు. ఊరిలో బంధువులు ఉన్నారు. వారికి భారం కాకూడదనే ఉద్దేశంతో వారికి దూరంగా ఇక్కడకు వచ్చాను. ఇక్కడ సంతోషంగా ఉన్నాను. మాలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తున్న నైట్‌షెల్టర్ ఫర్ హోమ్‌లెస్ పీపుల్ ఆశ్రయానికి రుణపడి ఉంటాం.
– జానకమ్మ, ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలు