అమీర్‌పేట్, మే 13: నిరు పేదలకు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్ పేరుతో పీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన ఖరీదైన పరికరాలను అందుబాటులోకి తేవడం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అమీర్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.72 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం, మంత్రి తలసాని మాట్లాడుతూ 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసే విషయంలో సీఎం కేసీఆర్ సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఉదారంగా వ్యవహరించారన్నారు. ఈసీజీ, ఎక్స్‌రే, యూఎస్జీ వంటి ఖరీదైన 57 రకాల వైద్య పరీక్షలు ఇకపై ప్రతి ఒక్కరు అమీర్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పొందవచ్చన్నారు. త్వరలోనే ఆసుపత్రికి ఆంబులెన్స్‌ను కూడా సమకూరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ మానవతా దృక్పథంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు కేవలం రూ. 5/-లకే భోజనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్, టీఎస్ డయాగ్నస్టిక్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, అమీర్‌పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషు కుమారి, ఎస్పీహెచ్వో డాక్టర్ రేవతిలతో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.