వనస్థలిపురం, మే 11 : ‘వస్తే మొత్తం డబ్బులతో వస్తా.. లేదంటే నాపేరు మీద ఇన్సూరెన్స్ క్లెయి మ్ చేయండి…’ అంటూ ఓ బ్యాంకు ఉద్యోగి స్నేహితులతో చెప్పి, తాను పని చేసే బ్యాంకులోనే నగదును కాజేసి పరారయ్యాడు. వనస్థలిపురంలోని ఓ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే ప్రవీణ్‌కుమార్ మంగళవారం యధావిధిగా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం 3.45 గంటలకు కడుపునొప్పిగా ఉందని, మందులు తెచ్చుకుంటానని మేనేజర్‌ను అనుమతి అడిగాడు. మేనేజర్ అనుమతితో బయటకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ సాయంత్రం వరకూ తిరిగిరాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన మేనేజర్, ప్రవీణ్‌కుమార్ క్యాబిన్‌కు వెళ్లి చూడగా ఆయన లెక్కలో రూ. 4 లక్షల నుంచి రూ. 5లక్షల వరకు తక్కువగా వచ్చింది. ఇదే మాదిరిగా ప్రతి రోజూ లెక్క తక్కువగా చూపి మొత్తం రూ.22.53లక్షలను మాయం చేశాడు. బ్యాంకు నగదుతో నిందితుడు పరారైనట్లు గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆన్లైన్ బెట్టింగుల వ్యసనానికి లోనై ప్రవీణ్ భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తున్నది.